‘సప్తగిరి’ ముందే వస్తున్నాడు.. నేను సేఫ్‌: నాని

0

‘సప్తగిరి’ ముందే వస్తున్నాడు.. నేను సేఫ్‌: నాని
nani sapthagiri
హైదరాబాద్‌: సప్తగిరి అంటే తనకు చాలా ఇష్టమని హీరో నాని అన్నారు. సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ఎల్‌. చరణ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని మూడో పాటను బుధవారం నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సప్తగిరి అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి పనిచేసింది ఒక్క సినిమాలోనే. తన సినిమా ట్రాక్‌, టైమింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశా. ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాల్లో సప్తగిరి పాత్ర చాలా సరదాగా ఉంటుంది. సప్తగిరి తనకంటూ ఓ స్టైల్‌ను ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు నేను విడుదల చేసిన ఈ పాటను చూస్తుంటే.. ఓ పెద్ద సినిమా పాటను చూసిన అనుభూతి కలిగింది’ అని చెప్పారు.
నాని అనంతరం సప్తగిరి, మిగిలిన చిత్ర బృందంతో మాట్లాడుతూ.. ‘నా సినిమా (‘ఎంసిఎ’) విడుదలౌతున్నప్పుడు మీరు దీన్ని (సప్తగిరి ఎల్‌ఎల్‌బి) విడుదల చేయడం లేదుగా?’ అని సరదాగా నవ్వుతూ అన్నారు. ఆయన అడిగిన ఈ ప్రశ్నకు పక్కనే ఉన్న సప్తగిరి ఒక్కసారిగా నవ్వుతూ నానిను గట్టిగా పట్టుకున్నారు. ఇంకా ముందే సినిమాను విడుదల చేస్తున్నామని చిత్ర బృందం చెప్పడంతో.. ‘ఓకే నా సినిమా కంటే ముందు విడుదల చేస్తున్నారు.. కాబట్టి నేను సేఫ్‌’ అని నాని అన్నారు.
‘ఇంత కలర్‌ఫుల్‌ సాంగ్స్‌ ఉంటే నా సినిమాకు వెళ్లకుండా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’కే వెళ్తా. కమర్షియల్‌, వినోదం రెండు అంశాలు ఉన్న ఈ సినిమా చాలా బాగుంటుందని అనుకుంటున్నా. కోర్టు రూమ్‌ డ్రామాను ఇంత వరకూ తెలుగులో ఎవరూ తీయలేదు. హిందీ సినిమా ‘జాలీ ఎల్‌ఎల్‌బి 2’ కంటే ఈ చిత్రం పదిరెట్లు ఎక్కువ వినోదాత్మకంగా ఉంటుంది అనుకుంటున్నా’ అంటూ నాని ప్రసంగం ముగించారు. నాని తర్వాతి చిత్రం ‘ఎంసిఎ’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌) డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇటీవల ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ విడుదల చేశారు. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుల్గానిన్‌ స్వరాలు అందించారు. డిసెంబరు 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి 2’కు తెలుగు రీమేక్‌ ఇది.

వ్యాఖ్యలు లేవు